ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో సాధించిన ప్రగతిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించగా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినమ్రంగా స్పందించారు. “పవనన్నా.. ఇది మనందరి విజయం” అని పేర్కొంటూ, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు విద్యాశాఖ అధికారులు సమష్టిగా చేసిన కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని లోకేష్ తెలిపారు. కూటమి ప్రభుత్వ మార్గనిర్దేశంలో ఏపీ విద్యాశాఖను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అంతకుముందు పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. గతేడాది కంటే ఈసారి ఫలితాలు మెరుగ్గా ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 72.8 నుండి 78.39 శాతానికి పెరగడం శుభపరిణామన్నారు. మంత్రిగా లోకేష్ అమలు చేసిన ‘మెగా పేరెంట్ టీచర్స్ మీట్’, ‘100 రోజుల ప్రణాళిక’ వంటి సంస్కరణలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని, ఈ విజయం విద్యాశాఖలో వస్తున్న మార్పుకు నిదర్శనమని పవన్ కొనియాడారు.
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు, వారి విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులు సత్ఫలితాలను ఇస్తున్నాయని నేతలు అభిప్రాయపడ్డారు. పవన్ ప్రోత్సాహం, ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని లోకేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.









