మైక్రో ఫైనాన్స్ స్కామ్‌లో మంగ్లీ పేరు? పోలీసులకు చేరిన ఫిర్యాదుతో కలకలం!

ప్రముఖ జానపద గాయని మంగ్లీ (సత్యవతి) చుట్టూ ఇప్పుడు ఒక భారీ ఆర్థిక వివాదం ముసురుకుంది. మైక్రో ఫైనాన్స్ పేరుతో సుమారు 10 కోట్ల రూపాయల మేర పెట్టుబడిదారులను మోసం చేశారంటూ హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆమెపై, ఆమె సోదరుడు శివ మరియు ఇతరులపై ఫిర్యాదు నమోదైంది. అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి వందలాది మంది నుండి వసూలు చేసిన ఈ నిధులను తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారని బాధితుల తరపు న్యాయవాది పేర్కొన్నారు.

ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించడంతో మంగ్లీ తీవ్రంగా స్పందించారు. తనకు ఈ స్కామ్‌తో ఎలాంటి సంబంధం లేదని, అసలు ‘మైక్రో ఫైనాన్స్’ అనే పదమే తనకు తెలియదని ఆమె స్పష్టం చేశారు. తన ఎదుగుదలను ఓర్వలేక, కొంతమంది పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరుని వాడుకుని బెదిరింపులకు పాల్పడుతున్న సదరు న్యాయవాదిపైనే ఆమె నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఎదురు ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం ఈ కేసులో పోలీసులు ఇరుపక్షాల ఫిర్యాదులను విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు రామావత్ మధు అరెస్టుతో ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనే కోణంలో దర్యాప్తు ముమ్మరమైంది. మంగ్లీ కేవలం ప్రచారకర్తగా మాత్రమే వ్యవహరించారా లేదా ఈ లావాదేవీల్లో ఆమెకు ప్రత్యక్ష భాగస్వామ్యం ఉందా అనే విషయాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు