హైదరాబాద్లోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మెహర్ ఉన్నీసా (25) అనే వివాహిత అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. బాధితురాలి తండ్రి షేక్ హమీద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మైలార్దేవ్పల్లి హసన్ నగర్ నివాసి అయిన మెహర్ ఉన్నీసాకు 2018లో మహమ్మద్ సుభాన్తో వివాహమైందని, వారికి ఇద్దరు కుమారులు ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మనస్పర్థల కారణంగా గత రెండు నెలలుగా ఆమె బండ్లగూడలోని తన తండ్రి ఇంట్లోనే నివసిస్తోంది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 6:30 గంటలకు ఇంట్లో ప్రార్థనలు పూర్తి చేసుకున్న తర్వాత, ఆమె ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిపోయింది. గతంలో కూడా ఆమె రెండు మూడు సార్లు ఇలాగే వెళ్లి తిరిగి రావడంతో, ఈసారి కూడా అలాగే వస్తుందని కుటుంబ సభ్యులు వేచి చూశారు. అయితే నాలుగు రోజులు గడిచినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఆందోళనకు గురైన తండ్రి పోలీసులను ఆశ్రయించారు. అదృశ్యమైన సమయంలో ఆమె ఆకుపచ్చ రంగు కుర్తా మరియు పైజామా ధరించి ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై బండ్లగూడ పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేసి గాలింపు చర్యలు వేగవంతం చేశారు. 5.2 అడుగుల ఎత్తు, నలుపు రంగు జుట్టు, హిందీ మాట్లాడే మెహర్ ఉన్నీసాకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే బండ్లగూడ పోలీస్ స్టేషన్కు లేదా మెయిన్ పీసీఆర్ నంబర్లకు (27852333, 8712665184, 8712661577) సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.









