వానాకాలానికి ముందే సింగూర్ డ్యాం పనులు పూర్తి చేయాలి…మంత్రి దామోదర్ రాజనర్సింహ
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
పనుల్లో రాజీ లేదు… గడువులోపు పూర్తి చేయాలి
.
: వానాకాలం ప్రారంభమయ్యేలోపు సింగూర్ డ్యాం మరమ్మత్తులు పూర్తి చేయాలని, నీటి నిల్వకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
సోమవారం పుల్కల్ మండలంలో సింగూర్ డ్యాం మరమ్మత్తులు, సింగూర్ కాలువల లైనింగ్ పనులను వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి,ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పనులలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని మంత్రి స్పష్టంగా ఆదేశించారు.
బస్వాపూర్ కాలువ లైనింగ్ పనులను కూడా పరిశీలించిన మంత్రి, నీటి పారుదలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు.
సింగూర్ ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, రిజర్వాయర్ మధ్యలో ఐలాండ్ అభివృద్ధి, టూరిజం పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ఎస్టిమేట్లు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం పుల్కల్ మండలంలోని బస్వాపూర్‌లో 31 ఎకరాల్లో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను మంత్రి పరిశీలించారు. సుమారు రూ. 200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ విద్యాసంస్థ పనులను వేగవంతం చేసి, వచ్చే విద్యాసంవత్సరానికి ముందుగానే పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు కలెక్టర్ పాండు, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీరింగ్ అధికారిని రాజమ్మ, డిఈఈ జై భీమ్, డిప్యూటీఈ ఈ నాగరాజు, టీ ఎస్ ఈ డబ్ల్యూ ఐ డి సి డీఈ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ ఈఈ రాజు, ఏఈ మల్లప్ప, ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.









