సంగారెడ్డి జిల్లా కంగ్టీ మండలంలోని రాసోల్ గ్రామంలో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్న 61 ఏళ్ల వసంత కుమారిని, ఆమె భర్త చేసిన ఆర్థిక మోసాలకు బాధ్యురాలిని చేస్తూ గ్రామస్తులు చెట్టుకు కట్టేసి అవమానించారు. వయసు మళ్లిన వృద్ధురాలని కూడా చూడకుండా ఐదుగురు వ్యక్తులు ఆమెను నిర్బంధించి, తాళ్లతో చెట్టుకు బంధించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. వసంత కుమారి భర్త ప్రభాకర్ రావు హెచ్‌బీఎం ఫైనాన్స్ పేరుతో వ్యాపారం చేస్తూ గ్రామస్తుల నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారు. అయితే ఆ డబ్బును తిరిగి చెల్లించడంలో విఫలమైన ఆయన, గత రెండు రోజులుగా పరారీలో ఉన్నారు. తమ డబ్బు తిరిగి రాదన్న ఆందోళనలో ఉన్న బాధితులు, విధులకు హాజరైన వసంత కుమారిని అడ్డుకున్నారు. తన భర్త ఆచూకీ తనకు తెలియదని ఆమె మొరపెట్టుకున్నప్పటికీ వినకుండా, ఆగ్రహంతో ఆమెను చెట్టుకు కట్టేసి అవమానకరంగా ప్రవర్తించారు.
గ్రామ పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఆమె బంధ విముక్తురాలయ్యారు. ఈ అమానుష ఘటనపై బాధితురాలు కంగ్టీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సై దుర్గారెడ్డి ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మహిళను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.









