ఐపీఎల్ 2026లో భాగంగా నేడు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్లు తలపడుతున్నాయి. గత మ్యాచ్‌లో కోల్‌కతాపై ఘనవిజయం సాధించిన ఉత్సాహంలో హైదరాబాద్ ఉండగా, తొలి మ్యాచ్‌లో ఓడిన లక్నో ఈసారి బోణీ కొట్టాలని చూస్తోంది. అయితే, వెన్నునొప్పి కారణంగా హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం ఆ జట్టుకు పెద్ద మైనస్‌గా మారింది. ఆయన స్థానంలో ఇషాన్ కిషన్ తాత్కాలిక కెప్టెన్‌గా జట్టును నడిపిస్తున్నారు.
ఉప్పల్ పిచ్ సాధారణంగా బ్యాట్స్‌మెన్‌లకు అనుకూలంగా ఉండటంతో నేడు పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక్కడ మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 200 పరుగులుగా ఉండటం గమనార్హం. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, రిషబ్ పంత్ వంటి స్టార్ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటంతో మరో హై-స్కోరింగ్ థ్రిల్లర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గణాంకాల ప్రకారం ఇక్కడ ఛేజింగ్ చేసిన జట్టుకే విజయవకాశాలు ఎక్కువగా ఉండటంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
మరోవైపు, స్టేడియానికి వచ్చే ప్రేక్షకులకు పోలీసులు కఠిన నిబంధనలు విధించారు. భద్రతా దృష్ట్యా సెల్ఫీ స్టిక్స్, పవర్ బ్యాంకులు, ఛార్జర్లు, ఇయర్ ఫోన్ బడ్స్ వంటి వస్తువులను స్టేడియం లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుండటంతో ఎండ తీవ్రత దృష్ట్యా అభిమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హెడ్ టు హెడ్ రికార్డుల్లో లక్నోదే పైచేయి ఉన్నప్పటికీ, హోమ్ గ్రౌండ్‌లో హైదరాబాద్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.









