తెలంగాణలో గ్యాస్ బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం: 3,699 డొమెస్టిక్ సిలిండర్లు సీజ్, 216 మందిపై ఎఫ్ఐఆర్!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా తలెత్తిన గ్యాస్ కొరతను సాకుగా చూపుతూ, అక్రమంగా గ్యాస్ నిల్వలు పెంచి బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాలపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ అధికారులు విరుచుకుపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు చేపట్టిన విస్తృత దాడుల్లో గృహ అవసరాలకు వాడాల్సిన డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న హోటళ్లు, టిఫిన్ సెంటర్ల గుట్టురట్టు చేశారు. నిజమైన లబ్ధిదారులకు గ్యాస్ అందకుండా చేస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవడంలో భాగంగా ప్రత్యేక తనిఖీ బృందాలను రంగంలోకి దించారు.

పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం, గత నెల 12వ తేదీ నుంచి ఈనెల 3వ తేదీ వరకు నిర్వహించిన దాడుల్లో మొత్తం 3,699 గృహ అవసరాల సిలిండర్లను, 70 చిన్న సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఈ సిలిండర్ల విలువ సుమారు రూ. 1.10 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అక్రమ దందాలకు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,275 కేసులు నమోదు చేయగా, 216 మంది నిందితులపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

ముఖ్యంగా గృహ అవసరాల గ్యాస్‌ను కమర్షియల్ అవసరాలకు మళ్లించే వారిపై నిఘా పెంచామని, నిబంధనలు అతిక్రమిస్తే గ్యాస్ కనెక్షన్లను శాశ్వతంగా తొలగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అక్రమ నిల్వలు పెట్టి వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసే ఏజెన్సీలపై కూడా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. యుద్ధం కారణంగా ఏర్పడిన అంతర్జాతీయ ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, సామాన్య ప్రజలకు గ్యాస్ కొరత లేకుండా చూడటం కోసమే ఈ మెరుపు దాడులు నిర్వహిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు