టీఆర్‌ఎస్ పేరుతో కవిత కొత్త పార్టీ: బీఆర్‌ఎస్ పునాదులు కదిలేనా? రాజకీయాల్లో ‘సెంటిమెంట్’ సమరం!

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపునకు రంగం సిద్ధమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన స్వతంత్ర రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం వదులుకున్న ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (టీఆర్‌ఎస్) అనే పేరును ఆమె తన పార్టీకి ఖరారు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దశాబ్దాల ఉద్యమ చరిత్ర, భావోద్వేగ సెంటిమెంట్ ముడిపడి ఉన్న ఈ పేరును కవిత సొంతం చేసుకుంటే, అది బీఆర్‌ఎస్ పార్టీ ఉనికికే పెను సవాల్‌గా మారే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో జరుగుతున్న పరిణామాలపై కవిత ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడం చారిత్రక తప్పిదమని, జాతీయ రాజకీయాల మోజులో తెలంగాణ అస్తిత్వాన్ని వదులుకోవడం వల్ల ప్రజలతో ఉన్న పేగుబంధం తెగిపోయిందని ఆమె అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తన పార్టీలో ‘బిహార్’ వ్యూహకర్తలకు చోటు లేదని, కేవలం ఆచార్య జయశంకర్ తెలంగాణ సిద్ధాంతాలే ప్రాతిపదికగా ఉంటాయని చెప్పడం ద్వారా ఆమె నేరుగా కేటీఆర్ అనుసరిస్తున్న కార్పొరేట్ తరహా రాజకీయాలను టార్గెట్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని విమర్శిస్తూ, తాను అచ్చమైన ఉద్యమకారులతో కలిసి ముందుకు సాగుతానని ప్రకటించారు.

ఒకవేళ కవిత నిజంగానే టీఆర్‌ఎస్ పేరుతో రంగంలోకి దిగితే, బీఆర్‌ఎస్ వైపు ఉన్న అసంతృప్త నేతలు, పాత ఉద్యమకారులు ఆమె వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏప్రిల్ 25న ఆమె ప్రకటించబోయే కొత్త పార్టీ ఎజెండాలో ‘ఆడబిడ్డ’ సెంటిమెంట్ ప్రధాన అస్త్రంగా ఉండబోతోంది. కేసీఆర్ స్థాపించిన సుదీర్ఘ రాజకీయ వారసత్వాన్ని ఆమె తన వైపు తిప్పుకునేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం, గులాబీ శ్రేణుల్లో అయోమయానికి దారితీస్తోంది. తండ్రి వదులుకున్న అస్త్రమే తనయకు ఆయుధంగా మారిన ఈ తరుణంలో, తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు