కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యసభలో కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు పచ్చి అబద్ధాలని, చరిత్రను వక్రీకరించేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయిన కిషన్ రెడ్డి, నేడు పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. సభలో పలికింది కిషన్ రెడ్డే అయినప్పటికీ, ఆయన వెనుక ఉండి పలికించింది మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని హరీశ్ రావు తన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా విమర్శించారు.
ముఖ్యంగా ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించడంపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు తప్పుబట్టారు. విభజన చట్టానికి సవరణ తెచ్చి ఆర్డినెన్స్ ద్వారా ఆ మండలాలను ఏపీకి కట్టబెట్టింది బీజేపీ ప్రభుత్వమేనని, ఆ పాపంలో కిషన్ రెడ్డికి కూడా భాగం ఉందని గుర్తు చేశారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే కిషన్ రెడ్డి పార్లమెంట్‌లో వల్లెవేయడం కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న ‘చీకటి పొత్తు’కు నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం వల్ల సాగు విస్తీర్ణం పెరిగిందని కేంద్ర ఆర్థిక సర్వేనే చెబుతుంటే, కిషన్ రెడ్డికి అది ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.
ప్రజా ధనంతో నిర్మించే ప్రాజెక్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం కిషన్ రెడ్డి అవివేకానికి నిదర్శనమని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. “మీ ప్రభుత్వం నిర్మిస్తున్న జాతీయ రహదారులకు మీ జేబులో డబ్బులు ఖర్చు పెడుతున్నారా?” అని నిలదీశారు. తెలంగాణ వాదాన్ని వినిపించడంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం జలాలు పంట పొలాలకు చేరుతుండటం అబద్ధమైతే, తాను క్షేత్రస్థాయిలో నిరూపించేందుకు సిద్ధమని, చర్చకు వచ్చే దమ్ము కిషన్ రెడ్డికి ఉందా అని హరీశ్ రావు సవాల్ విసిరారు.









