హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం నుంచి ఒక స్పెషల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ పహిల్వాన్ లుక్‌లో కనిపిస్తున్నారు. చేతిలో పెద్ద గద పట్టుకుని, కండలు తిరిగిన దేహంతో ఉన్న చరణ్ పోస్టర్ హనుమంతుడి రూపాన్ని తలపిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ పోస్టర్లో ఎక్కడా విడుదల తేదీని ప్రస్తావించకపోవడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.
నిజానికి ‘పెద్ది’ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేస్తామని గతంలో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ, తాజాగా విడుదలైన పోస్టర్లో గానీ, చిత్ర బృందం పెట్టిన సోషల్ మీడియా పోస్టుల్లో గానీ రిలీజ్ డేట్ కనిపించకపోవడంతో సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రం జూన్ 26వ తేదీకి పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఏప్రిల్ 29న ప్రీమియర్స్ అంటూ ప్రచారం చేస్తున్నప్పటికీ, మేకర్స్ మౌనం వహించడం కన్ఫ్యూజన్ను పెంచుతోంది.
ముఖ్యంగా ఈ సినిమా విడుదలపై క్లారిటీ ఇవ్వాల్సిన చిత్ర యూనిట్, ఇలాంటి పోస్టర్లతో అభిమానులను మరింత గందరగోళంలోకి నెట్టేస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రామ్ చరణ్ ఈ మధ్యే ఒక ప్రమోషనల్ వీడియోలో సినిమా లేట్ అవ్వడం లేదని చెప్పినప్పటికీ, తాజా పోస్టర్ ఆ మాటలకు భిన్నంగా కనిపిస్తోంది. మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా విడుదల తేదీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రిలీజ్ విషయంలో నెలకొన్న ఈ సందిగ్ధత సినిమాపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపకముందే మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.









