కూటమి ప్రభుత్వంలోని కొందరు ఎమ్మెల్యేల దూకుడు ప్రవర్తనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఇటీవల ఎస్పీ కార్యాలయంలో నిరసనకు దిగిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు క్రైమ్ సీరియల్స్ ఎక్కువగా చూడటం వల్లే వారి ప్రవర్తనలో కంట్రోల్ తప్పుతున్నారని, ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించింది సేవ చేయడానికే తప్ప ఇలా ఆఫీసులపై దాడులు చేయడానికి కాదని ఆయన గట్టిగా హెచ్చరించారు.
ఎమ్మెల్యేలు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారని, సమాజానికి ఆదర్శంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. టెలివిజన్లలో వచ్చే క్రైమ్ కథనాలు మనసులో ఆగ్రహాన్ని, ఉద్రేకాన్ని పెంచుతాయని, వాటికి దూరంగా ఉండాలని కోరారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా సహించేది లేదని, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా క్లాస్ పీకారు. ముఖ్యంగా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు, యువ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని ఆయన పిలుపునిచ్చారు.
రాజకీయాల్లో ఒత్తిళ్లు సహజమని, మానసిక ఒత్తిడి లేదా టెన్షన్ ఉంటే ఎమ్మెల్యేలు మెడిటేషన్ (ధ్యానం) లేదా యోగా చేయాలని చంద్రబాబు సలహా ఇచ్చారు. ఆ ఒత్తిడిని అధికారుల మీదో, ప్రజల మీదో చూపించడం ఏమాత్రం సరికాదని హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచక పాలన మళ్ళీ పునరావృతం కాకూడదని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఈ మేరకు ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులను కూడా కోరారు.









