ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం బీహార్‌లో ఆవిష్కృతమైంది. పట్నాలోని గాంధీ మైదాన్‌లో జరుగుతున్న బుక్ ఫెయిర్‌లో ‘మై’ అనే పుస్తకం ధర అక్షరాలా రూ. 15 కోట్లు కావడం సంచలనంగా మారింది. బీహార్‌కు చెందిన రచయిత రత్నేశ్వర్ రచించిన ఈ పుస్తకం ప్రపంచ పుస్తక రంగంలోనే కొత్త రికార్డును సృష్టించింది. పుస్తకం విడుదలైన వెంటనే సందర్శకులు భారీ సంఖ్యలో బుక్ ఫెయిర్‌కి తరలివచ్చారు.
ఈ పుస్తకాన్ని మొత్తం 16 కాపీలు మాత్రమే ముద్రించగా, అందులో 11 కాపీలను రచయిత వ్యక్తిగతంగా ప్రత్యేక వ్యక్తులకు బహుమతిగా ఇచ్చారు. కేవలం మూడు కాపీలను మాత్రమే అమ్మకానికి ఉంచడం వల్ల దీని విలువ మరింత పెరిగింది. రత్నేశ్వర్ ప్రకారం, ఈ పుస్తకం జీవన తత్వాన్ని లోతుగా వివరిస్తూ ఆధ్యాత్మిక మేల్కొలుపు వైపు పాఠకులను నడిపిస్తుంది.
పుస్తకం ధరను తానే నిర్ణయించలేదని, “దేవుడే నిర్ణయించాడు” అని రచయిత రత్నేశ్వర్ వెల్లడించారు. తన ఆధ్యాత్మిక యాత్ర, తత్వచింతన, ప్రపంచాన్ని చూసే దృష్టి ఈ విలువను నిర్ణయించాయని చెప్పారు. “ధర ఎక్కువ అనిపిస్తే కొనాల్సిన అవసరం లేదు. ఈ గ్రంథం జ్ఞానోదయం స్థితిని అన్వేషించే వారికి మాత్రమే” అని ఆయన వివరణ ఇచ్చారు. గౌతమ బుద్ధుడు పొందిన పరమజ్ఞాన స్థితి ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం ఈ పుస్తకం అందిస్తుందని రత్నేశ్వర్ పేర్కొన్నారు.
పట్నా బుక్ ఫెయిర్‌ను డిసెంబర్ 5న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రారంభించారు. ఈ ప్రదర్శన డిసెంబర్ 16 వరకు కొనసాగుతుంది. ఫెయిర్‌లో ‘మై’ పుస్తకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పుస్తకంలోని తత్త్వం, ధర, అరుదైన కాపీలు — ఇవన్నీ చూసేందుకు పాఠకులు, పుస్తక ప్రియులు పెద్ద సంఖ్యలో గాంధీ మైదాన్‌కు చేరుకుంటున్నారు.








