వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్‌ను ములుగు ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్, ఓఎస్డీ శివం ఉపాధ్యాయ శనివారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రెండు జిల్లాల పోలీస్ వ్యవస్థల మధ్య కొనసాగిస్తున్న సమన్వయం, చట్ట-శాంతి పరిరక్షణలో పరస్పర సహకారం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా నేరాల నియంత్రణ, భద్రతా చర్యలు, ప్రజల్లో నమ్మకం పెంపొందించే ప్రయత్నాలు, ఇంటర్-డిస్ట్రిక్ట్ ఆపరేషన్ల సమన్వయం వంటి కీలక విషయాలు చర్చకు వచ్చాయి. ప్రాంతీయ భద్రతా పరిస్థితులను సమీక్షించిన అధికారులు భవిష్యత్‌లో సంయుక్తంగా మరింత సమర్థవంతమైన చర్యలు చేపట్టే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు.
వచ్చే నెలలో జరగనున్న మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర దృష్ట్యా రెండు జిల్లాల మధ్య భారీ స్థాయి పోలీస్ బందోబస్తు అవసరం ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. జాతర సమయంలో భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, పర్యవేక్షణ, సంఘటనల నివారణ చర్యల్లో ఎటువంటి లోపం లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ములుగు ఎస్పీ తెలిపారు.
జిల్లా పోలీస్ విభాగాలు చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ప్రశంసించారు. నేరాల నియంత్రణ, ప్రజా భద్రత, అత్యవసర పరిస్థితుల్లో స్పందన వంటి రంగాల్లో రెండు జిల్లాల మధ్య పరస్పర సహకారం మరింత బలోపేతం కావాలని సూచించారు. సంయుక్త ప్రయత్నాల ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించవచ్చని అధికారులు పేర్కొన్నారు.









