రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, పంచ సూత్రాల ఆధారంగా రైతులకు మరింత మేలు చేసే కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. కృష్ణా జిల్లా ఘంటసాలలో ప్రారంభించే ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడంతో పాటు, వారికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని అందించే వేదికగా నిలుస్తుందని చెప్పారు.
నేటి నుంచి నవంబరు 29 వరకు అధికారులు ప్రతి రైతు ఇంటిని సందర్శించి వ్యవసాయం సంబంధించిన కీలక అంశాలపై అవగాహన కల్పించనున్నారు. పంటల ఎంపిక నుంచి సాగు విధానాలు, భూసార విశ్లేషణ నుంచి పంటల రక్షణ వరకు రైతులకు అవసరమైన సమాచారాన్ని ఇంటి వద్దకే తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. వ్యవసాయంపై రైతుల అవగాహన పెరిగితేనే రంగం అభివృద్ధి చెందుతుందని మంత్రి వివరించారు.
డిసెంబరు 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్ వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రోత్సాహం, ప్రభుత్వ సహకార పథకాల గురించి ఈ వర్క్‌షాప్‌లలో విశదీకరించనున్నారు. వ్యవసాయం మాత్రమే కాకుండా ఉద్యాన, పట్టు, ఆక్వా, పాడి, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం రంగాల్లో ఉన్న వారి సమస్యలు, అవకాశాలను కూడా ఈ కార్యక్రమం ద్వారా చర్చించనున్నట్లు చెప్పారు.
గత 17 నెలలుగా ప్రభుత్వం రైతు ప్రయోజనాల కోసం పనిచేస్తోందని, రైతు సేవా కేంద్రాల సిబ్బంది ముందుంటూ ఈ కార్యక్రమాలను అమలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ప్రతి కేంద్రంలో కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేసి, రైతులకు మరిన్ని అవకాశాలు, సాంకేతిక సహాయం, అవగాహన కార్యక్రమాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతు అభివృద్ధి దేశ అభివృద్ధితో ముడిపడి ఉన్నందున, ఈ కార్యక్రమాలు రైతులకు మరింత బలాన్ని తీసుకురావడం ఖాయమని చెప్పారు.









