ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. హిందువులు ఉన్నంత వరకు ప్రపంచం నిలబడుతుందని, హిందువులు లేని రోజు ప్రపంచమే అంతమైపోతుందని ఆయన సంచలన వ్యాఖ్యానించారు. సమాజం ఎదుర్కొంటున్న మారుతున్న పరిస్థితులపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. కాలప్రవాహంలో ఎన్నో జాతులు, నాగరికతలు నశించినా భారత నాగరికత శాశ్వతంగా నిలబడటానికి కారణం హిందూ సమాజమని తెలిపారు.
భగవత్ మాట్లాడుతూ పురాతన నాగరికతలైన యునాన్, మిస్ర్, రోమా దేశాల సంస్కృతులు కాలగర్భంలో కలిసిపోయాయని, కానీ భారత నాగరికత మాత్రం ఇంకా జీవించి ఉందని ఉదహరించారు. భారతీయ సమాజంలో ఉన్న అనుబంధం, పరస్పర పరిరక్షణ, సాంస్కృతిక విలువలు ఈ నాగరికతను ముందుకు నడిపిస్తున్నాయన్నారు. మంచి సంబంధాల కారణంగా భారత సమాజం నిలబడగలిగిందని వివరించారు.
భారత సమాజం అవసరమైన మార్పులను స్వయంగా చేసుకుంటూ ముందుకు సాగగలదని భగవత్ పేర్కొన్నారు. సమాజానికి కావలసినదాన్ని హిందూ సమాజం సంపాదించి ఇవ్వగలదని, ఇది ఈశ్వరుడి కర్తవ్యమే అని ఆయన అభిప్రాయపడ్డారు. హిందువుల జీవన విధానం, సంస్కృతి, విలువలు ప్రపంచ స్థిరత్వానికి మూల స్తంభాలు అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమంలో వెలువడగా, ప్రస్తుతం ఆ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. ఆయన వ్యాఖ్యలపై అనేక వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. కొందరు దీనిని ప్రశంసించగా, మరికొందరు విమర్శిస్తున్నారు. అయితే భగవత్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో మరోసారి చర్చనీయాంశమయ్యాయి.









