ఆదిలాబాద్ జిల్లా బోథ్ పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని బజార్ హత్నూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన చేవుల రత్నమాల (48) అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె కుమారుడు చేవుల లక్ష్మణ్ (22) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదం నవంబర్ 9 సాయంత్రం చోటుచేసుకుంది. బోథ్ సీఐ గురుస్వామి ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించారు.
సీఐ తెలిపిన వివరాల ప్రకారం, రత్నమాల తన కుమారుడితో కలిసి వ్యవసాయ పనులు ముగించుకొని ఎద్దుల బండిపై గ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో నిందితుడు తరడపు ప్రదీప్ కుమార్ మద్యం మత్తులో అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా కారు (23BH5470G) నడుపుతూ బజార్ హత్నూర్ గ్రామ శివారులో వారి ఎద్దుల బండిని ఢీకొట్టాడు. ఢీ కొట్టిన తీవ్రతకు రత్నమాల గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ప్రమాదం తరువాత పోలీసులు తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు స్పష్టమైన ఆధారాలు లభించడంతో నిందితుడు ప్రదీప్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు బోథ్ సీఐ గురుస్వామి తెలిపారు. ఈ ప్రమాదం గ్రామంలో తీవ్ర ఆవేదనకు కారణమైంది.
పోలీసులు ప్రజలకు మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ప్రాణాలకు ముప్పు అని, ఇలాంటి ఘటనలు మరల జరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బోథ్ ఎస్ఐ శ్రీ సాయి, సిబ్బంది పాల్గొన్నారు.









