రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో విద్యుత్ షాక్ తగిలి వాటర్‌మెన్ మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. దోసలగూడెం కాలనీకి చెందిన తుమ్మల రమేష్ (40) స్థానిక మేజర్ గ్రామపంచాయతీలో వాటర్‌మన్‌గా పనిచేస్తున్నాడు. గ్రామంలో మంచినీటి సరఫరా సమస్య తలెత్తడంతో పంచాయతీ సిబ్బందితో కలిసి వెంకటాద్రి చెరువులో బోరు మోటారు మరమ్మతు చేయడానికి వెళ్లాడు.
ఈ క్రమంలో చెరువులోని నీటిలో ఉన్న మోటార్ బాగు చేస్తుండగా రమేష్‌కు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువు నిండిపోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మృతుని కుటుంబ సభ్యులు చెరువు వద్దే బోరున విలపించారు. భార్య లతతో పాటు కుటుంబ సభ్యులు నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీ వచ్చేంతవరకు శవాన్ని తరలించబోమని స్పష్టం చేశారు.
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, పీసీసీ ప్రతినిధి కటకం మృత్యుంజయం, డిఎల్పిఓ వీరభద్రయ్య సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వ స్థాయిలో ఆర్థిక సహాయం, ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులు శాంతించగా, రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు.









