మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోరం: ప్రేమజంటను బెదిరించి మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం!

మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలో అత్యంత హేయమైన ఘటన వెలుగుచూసింది. ఏకాంతంగా ఉన్న ఒక మైనర్ ప్రేమజంటను బెదిరించి, ఇద్దరు యువకులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగికి చెందిన 9వ తరగతి విద్యార్థిని తన ప్రియుడితో కలిసి హన్వాడ సమీపంలోని పిల్లిగుండు తండా అటవీ ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఈ దారుణం జరిగింది.

అక్కడే మాటు వేసిన మహబూబ్‌నగర్‌కు చెందిన అశోక్, లక్ష్మణ్ అనే ఇద్దరు యువకులు తొలుత ఆ జంటను భయపెట్టారు. వారి వద్ద ఉన్న రూ. 6,000 నగదును బలవంతంగా లాక్కున్నారు. అనంతరం ప్రియుడిని పక్కకు నెట్టివేసి, బాలికపై వరుసగా అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ క్రమంలో ప్రియుడు చాకచక్యంగా వ్యవహరించి వెంటనే ‘డయల్ 100’కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు నిమిషాల వ్యవధిలోనే ఘటనాస్థలానికి చేరుకుని నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ ప్రాంతంలో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయని, ఇప్పటికైనా పోలీసులు నిఘా పెంచి అటవీ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు