ఎండలు మండిపోతున్న వేళ కారులో ప్రయాణించేటప్పుడు ఏసీ తప్పనిసరి. అయితే, చాలామంది కారు ఎక్కగానే నేరుగా ఏసీని గరిష్ట స్థాయిలో ఆన్ చేస్తారు. ఇది పెద్ద తప్పు. కారు లోపల పేరుకుపోయిన వేడి గాలి బయటకు వెళ్లకుండా ఏసీ ఆన్ చేస్తే, క్యాబిన్ చల్లబడటానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల ఇంజిన్‌పై అదనపు భారం పడి మైలేజీ గణనీయంగా తగ్గిపోతుంది. కారు ఎక్కిన వెంటనే విండోలు కిందకు దించి, కాసేపు ఫ్యాన్ మాత్రమే ఆన్ చేయడం వల్ల లోపల ఉన్న వేడి గాలి త్వరగా బయటకు పోతుంది.
ఏసీ ఫిల్టర్లను క్రమబద్ధంగా శుభ్రం చేయకపోవడం వల్ల కూడా ఏసీ సామర్థ్యం తగ్గుతుంది. దుమ్ము పేరుకుపోయిన ఫిల్టర్ల కారణంగా గాలి ప్రసరణ సరిగ్గా జరగదు, దీనివల్ల ఏసీ గాలి తక్కువగా వస్తుంది. అలాగే, ‘రీసర్క్యులేషన్’ మోడ్‌ను సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. క్యాబిన్ ఒకసారి చల్లబడిన తర్వాత రీసర్క్యులేషన్ మోడ్ ఆన్ చేస్తే, లోపలి చల్లటి గాలినే ఏసీ యూనిట్ మళ్ళీ వినియోగించుకుంటుంది. ఫలితంగా కంప్రెషర్‌పై ఒత్తిడి తగ్గి మైలేజీ పెరుగుతుంది.
చాలామంది ఏసీని అత్యల్ప ఉష్ణోగ్రత (ఉదాహరణకు 18°C) వద్ద ఉంచుతారు, ఇది ఇంధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తుంది. నిపుణుల సూచన ప్రకారం, ఏసీని 24°C వద్ద ఉంచడం వల్ల అటు శరీరానికి సౌకర్యంగా ఉండటంతో పాటు కారు మైలేజీ కూడా మెరుగ్గా ఉంటుంది. అలాగే, గమ్యస్థానానికి చేరుకోవడానికి ఐదు నిమిషాల ముందే ఏసీ కంప్రెషర్‌ను ఆపివేసి కేవలం బ్లోయర్‌ను మాత్రమే నడపడం వల్ల ఏసీ డక్ట్‌లలో తేమ పేరుకుపోకుండా ఉంటుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ కారు ఏసీ కాలం చెల్లకుండా ఎక్కువ రోజులు మన్నిక వస్తుంది.









