తెలంగాణ రాజకీయాల్లో మరో చారిత్రాత్మక మలుపు చోటుచేసుకుంది. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన పాత మిత్రుడిని కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
కేసీఆర్‌ను కలిసిన సమయంలో జీవన్‌రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది అన్నా.. అందుకే దేవుడే నన్ను మీ దగ్గరికి పంపిండు” అంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు. గతంలో 2014లోనే కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చినప్పటికీ, కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇద్దరు నేతలు రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, జగిత్యాల నియోజకవర్గ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించి, అనంతరం కలిసి విందు ఆరగించారు.
గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల, ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని జీవన్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న ఆయన వంటి అనుభవజ్ఞుడు పార్టీలోకి రావడం బీఆర్ఎస్‌కు కొండంత అండని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ పునర్నిర్మాణం కోసం, రైతుల సంక్షేమం కోసం మళ్లీ కేసీఆర్ నాయకత్వం అవసరమని జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ చేరికతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కేడర్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది.









