ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసిన అనుభవాన్ని ప్రముఖ దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సినిమా రంగంలో అగ్రశ్రేణి హీరోగా ఉన్నా, నేడు అత్యున్నత పదవిలో ఉన్నా ఆయన వ్యక్తిత్వంలో రవ్వంత కూడా మార్పు రాలేదని కొనియాడారు. గతంలో ఆయనతో కలిసి పనిచేసిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు అధికార హోదాలో ఉండి కూడా అదే చిరునవ్వుతో పలకరించిన పవన్ కల్యాణ్‌ను ఒక ‘ఋషి’తో పోల్చారు.
రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పెంచుకున్న నాయకులను మనం చూశామని, కానీ నమ్మిన సిద్ధాంతం కోసం తనకున్న సౌకర్యాలను వదులుకుని నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్న పవన్ కల్యాణ్ తనకు ఒక ‘శిఖరం’లా కనిపించారని బాబీ పేర్కొన్నారు. తనపై ఆయన చూపించిన ప్రేమకు ఫిదా అయ్యానని, ఆయనతో గడిపిన సమయం తనకు ఎంతో ప్రత్యేకం అని వివరించారు. ఈ మేరకు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పవన్ కల్యాణ్‌పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.
జ్ఞానం కోసం రాజభోగాలను వదిలి అడవులకు వెళ్లిన బుద్ధుడి గురించి మనం చరిత్రలో చదువుకున్నామని, కానీ జనం కోసం తన సుఖాలన్నీ వదులుకుని శ్రమిస్తున్న ఒక ‘కర్మయోగి’ని తాను ఇవాళ కళ్లారా చూశానని బాబీ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, ఆయన పోరాట పటిమపై బాబీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జనసేనాని అభిమానులు మరియు సినీ ప్రముఖులు బాబీ పోస్ట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.









