నిలకడలేని జగన్ మాటలను ఎవరూ నమ్మరు: ‘టీడీపీ 3.0’తో కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తామన్న మంత్రి లోకేశ్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మాట మీద నిలకడ లేదని, ఆయన వ్యాఖ్యలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. టీడీపీ కేడర్ కోసం ఏర్పాటు చేసిన ‘కాఫీ కబుర్లు’ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు దూరంగానే ఉంటారని ఎద్దేవా చేశారు. ఒకరోజు ‘మావిగన్’ అని, మరోరోజు ‘మూడు రాజధానులు’ అని మారుస్తూ మాట్లాడటం ఆయన నైజమని, 30 అడుగుల ఇనుప కంచెల మధ్య ఉంటూ ప్రజల కష్టాలు ఆయనకేం తెలుస్తాయని లోకేశ్ ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ‘టీడీపీ 3.0’ వర్షన్‌తో సరికొత్త పంథాలో ముందుకు సాగుతోందని లోకేశ్ స్పష్టం చేశారు. పార్టీలో ప్రతి టర్మ్‌లో 33 శాతం కొత్తవారికి అవకాశం కల్పించడమే లక్ష్యమని, గ్రామస్థాయి నాయకుడు కూడా పొలిట్‌బ్యూరో వరకు ఎదిగేలా పారదర్శక వ్యవస్థను నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యకర్తల పనితీరును గుర్తించేందుకు ప్రత్యేక సభ్యత్వ నంబర్ ఆధారిత వ్యవస్థను వాడుతున్నామని, పైరవీలకు తావులేకుండా కేవలం కష్టపడి పనిచేసే వారికే పదవులు దక్కుతాయని ఆయన హామీ ఇచ్చారు.

టీడీపీని ఒక రాజకీయ విశ్వవిద్యాలయంగా అభివర్ణించిన లోకేశ్, ఏడాది పొడవునా కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ప్రకటించారు. పార్టీలో వ్యక్తుల కంటే వ్యవస్థే శాశ్వతమని, నాయకులు తమ తర్వాతి తరం నాయకత్వాన్ని తయారు చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ముగిసిందని, జూన్ నుంచి ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు అనే మహావృక్షం నీడే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని, అంతా కలిసి కష్టపడి మహానాడును విజయవంతం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు