తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నూతన రాజకీయ ప్రస్థానానికి సిద్ధమయ్యారు. ఈ నెల 25వ తేదీన కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించిన ఆమె, దానికి ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (టీఆర్ఎస్) అనే పేరును పరిశీలిస్తున్నట్లు వెల్లడించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. పాత పేరు, కొత్త జెండా, సరికొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని, ఉద్యమ సెంటిమెంట్‌ను తిరిగి రగిలిస్తానని ఆమె స్పష్టం చేశారు.
కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీని ‘భారత రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్)గా మార్చిన నేపథ్యంలో, ప్రస్తుతం ఖాళీగా ఉన్న టీఆర్ఎస్ పేరును ఎవరైనా వాడుకోవచ్చని కవిత అభిప్రాయపడ్డారు. అయితే తన పార్టీ జెండాలో గులాబీ రంగు ఉండదని, ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల పునాదిగా పార్టీ నడుస్తుందని ఆమె తెలిపారు. ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద ‘తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ’ పేరుతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆమె బృందం ప్రారంభించినట్లు సమాచారం.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రధాన శత్రువుగా పరిగణిస్తూ, మహిళా రిజర్వేషన్లు అమలైతే సిద్దిపేట లేదా గజ్వేల్ నుంచి పోటీ చేసేందుకు కవిత ఆసక్తి చూపుతున్నారు. బీఆర్ఎస్‌ను ‘ధనిక పార్టీ’గా అభివర్ణించిన ఆమె, తన పార్టీ ఉద్యమకారులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కేసు కొట్టివేత తర్వాత ప్రకృతి తనకు సహకరిస్తోందని వ్యాఖ్యానిస్తూ, యుద్ధానికి సిద్ధమని ఆమె రాజకీయ ప్రత్యర్థులకు సంకేతాలిచ్చారు.









