లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు మరో నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. తీసుకున్న అప్పు తీర్చాలంటూ యాప్ నిర్వాహకులు పెట్టిన తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేక కాకినాడ జిల్లాలో ఓ ఎంబీఏ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన మహమ్మద్ బషీర్ (22), కాకినాడ జిల్లా సూరంపాలెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తన అవసరాల నిమిత్తం కొన్నాళ్ల క్రితం ఒక ఆన్‌లైన్ లోన్ యాప్‌లో రుణం తీసుకున్న బషీర్, గడువు ముగిసినా అప్పు చెల్లించలేకపోయాడు. దీంతో యాప్ నిర్వాహకులు అతడిని ఫోన్ల ద్వారా వేధించడం ప్రారంభించారు.
నిర్వాహకుల వేధింపులు రోజురోజుకూ మితిమీరడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బషీర్, తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, లోన్ యాప్ నిర్వాహకుల వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.









