పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం తీవ్రత దృష్ట్యా అమెరికా, ఇజ్రాయెల్ మధ్య అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు అనుసరించిన వ్యూహాలు, అంచనాలు తప్పిదాలుగా మారాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. యుద్ధం ప్రారంభంలో ఇరాన్ సుప్రీం లీడర్ మరణంతో పాలన మారుతుందని ఆశించినప్పటికీ, ఇరాన్ గట్టి ప్రతీకార చర్యలకు దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి.
ఇరాన్‌లో పాలన మార్పు (Regime Change) సులువుగా జరిగిపోతుందని నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తప్పుదారి పట్టించారని జేడీ వాన్స్ ఒక ఫోన్ సంభాషణలో మండిపడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ యుద్ధం ముగింపు లేని సుదీర్ఘ పోరాటంగా మారకూడదని కోరుకుంటున్న వాన్స్, క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించి ఇజ్రాయెల్ అతిగా అంచనా వేసిందని విమర్శించారు. మరోవైపు, ఇరాన్ సైతం ట్రంప్ బృందంలోని ఇతర నేతలను కాదని, కేవలం జేడీ వాన్స్‌తోనే చర్చలకు మొగ్గు చూపుతుండటం గమనార్హం.
ఇరాక్ యుద్ధంలో పనిచేసిన మాజీ మెరైన్ అయిన జేడీ వాన్స్, అమెరికాను విదేశీ యుద్ధాలకు దూరంగా ఉంచాలనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ఇరాన్ వ్యవహారంలో ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ విషయంలో అధ్యక్షుడు ట్రంప్‌తో కూడా ఆయనకు కొన్ని అభిప్రాయభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరాలంటే వాన్స్ పాత్ర అత్యంత కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.









