భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. న్యూ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఈ భేటీ జరిగింది. ఇది ఇరు దేశాల మధ్య జరుగుతున్న 23వ వార్షిక ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం కావడంతో దీని ప్రాధాన్యం మరింత పెరిగింది.
ఈ సందర్భంగా మోదీ–పుతిన్లు పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఆహార భద్రత, ఆరోగ్య రంగం, వాణిజ్యం, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, రక్షణ రంగంలో సహకారం పెంపు వంటి ముఖ్య రంగాలు ప్రధాన అజెండాగా నిలిచాయి. ఇరు దేశాల మధ్య లేబర్ మైగ్రేషన్ మొబిలిటీ, పోర్టులు మరియు నౌకాయాన అభివృద్ధిపై కూడా చర్చ సాగింది.
సమావేశం అనంతరం ఇరు దేశాల ప్రతినిధులు కొత్త ఒప్పందాలపై సంతకాలు చేశారు. మోదీ–పుతిన్ల సమక్షంలో రెండు దేశాలకు చెందిన అధికారులు సంబంధిత పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే ఈ ఒప్పందాలు భవిష్యత్ సహకారానికి దారితీయనున్నాయని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
భారత్–రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా రక్షణ, ఇంధన, వాణిజ్య రంగాల్లో ఈ చర్చలు కీలక మలుపు తీసుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.








