గ్రామపంచాయతీ ఎన్నికల భద్రతపై డీజీపీ సమీక్ష

DGP Shivadhar Reddy directed Adilabad SPs to ensure peaceful, fair Gram Panchayat polls with strict border checks and strong security measures.

రాష్ట్రంలో మూడు విడతలుగా జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీలతో రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు భయపడకుండా ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచాలని సూచించారు. ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన నియమాలు, మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని, అనుచిత చర్యలకు పాల్పడే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

మహారాష్ట్ర సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో అక్రమ రవాణా, డబ్బు ప్రవాహం, మద్యం తరలింపులు జరగకుండా చెక్‌పోస్టులు కట్టుదిట్టం చేయాలని డీజీపీ ఆదేశించారు. అంతేకాకుండా మతపరమైన వివాదాలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించి ప్రతి కదలికను పర్యవేక్షించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.

ఎన్నికల విధుల్లో భాగంగా సాయుధ బలగాలను సమర్థవంతంగా వినియోగించాలని, ప్రజల్లో నమ్మకం పెంచేందుకు ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించాలని డీజీపీ సూచించారు. సున్నితమైన ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించడం ద్వారా ప్రజలకు భద్రత కల్పించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారనే విశ్వాసాన్ని కల్పించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించే వ్యక్తులను బైండ్ ఓవర్ చేయడం ద్వారా అశాంతి పరిస్థితులను నివారించవచ్చని కూడా చెప్పారు.

జిల్లా వ్యాప్తంగా తట్టి పోలీస్ యాక్ట్ అమలు చేయాలని, గ్రామాలను సందర్శిస్తూ ఎన్నికలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని డీజీపీ సూచించారు. ఎన్నికల ప్రక్రియలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రౌండ్ ద క్లాక్ పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మల్టీజోన్ వన్ ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐజీ ఎం. రమేష్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీలు అఖిల్ మహాజన్, జానకి షర్మిల, నితికా పంత్, ఇతర అధికారులు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share