వాడి గ్రామంలోని కల్లు దుకాణంపై మంగళవారం ఎల్లారెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు జరపడం గ్రామంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దాడుల అనంతరం నిర్వాహకుడు మల్ల గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు ప్రకటించినప్పటికీ, అసలు ఘటనలో నిజమైన బాధ్యత ఎవరిదో అనే ప్రశ్నలు మరింత గందరగోళం సృష్టిస్తున్నాయి. గ్రామంలో కల్లు విక్రయం నిర్వహించేది ఎవరో అందరికీ తెలిసిన విషయమే కావడంతో, కేసు నమోదు విధానంపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కల్లు దుకాణం నిర్వహించేది, కల్లు విక్రయించేది ఒకరే అయినప్పటికీ, అసలు వ్యక్తిని వదిలి ఓ అనామకుడిపై కేసు నమోదు చేయడం ఎంతవరకు సరైన చర్య అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బాధ్యత ఉన్న వ్యక్తిని కాపాడుతూ, కేవలం పత్రాల పరంగా కేసులు నమోదు చేస్తున్నట్లు కనిపిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు తగిన ఆధారాలు సేకరించకుండా కేసులు నమోదు చేయడం కేవలం నిబంధనల పేరుతో చూపుడు దాడులకే పరిమితమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మండలంలో లైసెన్సులు లేకుండా అనేక కల్లు దుకాణాలు నడుస్తున్నప్పటికీ, ఎక్సైజ్ శాఖ అధికారులు వీటిపై పెద్దగా పట్టించుకోరోదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో ఒకసారి దాడులు చేసి కేసులు నమోదు చేయడం, పైపై తనిఖీలు చేయడం మాత్రమే జరుగుతోందని వారి అభిప్రాయం. మండలంలో కల్తీకల్లు విక్రయాలు పెరిగిపోతున్నా, అధికారులు మాత్రం శాంపిల్స్ సేకరించడానికే పరిమితమవుతూ చర్యల వ్యవహారం సద్దుమణిగిపోతుందని గ్రామస్థులు విమర్శిస్తున్నారు.
గ్రామ ప్రజలు జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని, మండలవ్యాప్తంగా లైసెన్సు లేకుండా నడుస్తున్న కల్లు దుకాణాలు, కల్తీకల్లు తయారీ మరియు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు దోషులను వదిలేసి అనామకులపై కేసులు నమోదు చేయడం సమస్యను పరిష్కరించబోదని, నిజమైన చర్యలు తీసుకున్నప్పుడే అక్రమ కల్లు వ్యాపారానికి చెక్ పడుతుందని వారు చెబుతున్నారు. గ్రామ శాంతి భద్రత, ప్రజల ఆరోగ్యం కోసం ఈ వ్యవహారంలో అధికారులు నిజాయితీతో వ్యవహరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.









