నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్‌లోని కోటగిరి గ్రామపంచాయతీ ఎన్నికలు ఈసారి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సర్పంచ్ పదవికి ఏకంగా 31 మంది నామినేషన్లు దాఖలు చేయడంతో కోటగిరి రాజకీయాలు కాసేపు అదుపు తప్పేంతగా ఆసక్తికరంగా మారాయి. స్క్రూటినీ ప్రక్రియ పూర్తయిన తర్వాత 28 మంది అభ్యర్థులు బరిలో మిగిలినట్లు అధికారులు ప్రకటించడంతో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఇంత భారీగా నామినేషన్లు రావడం కోటగిరి చరిత్రలోనే మొదటిసారి జరుగుతుండటంతో అధికారులు, ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థులకు గుర్తులు కేటాయించనుండగా, గుర్తుల కేటాయింపు విషయంలో అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. ఓటర్లు సులభంగా గుర్తించగల గుర్తులు వస్తేనే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్న అభ్యర్థులు, తమకు అనుకూల గుర్తుల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొత్తం 28 గుర్తులు ఉండే బ్యాలెట్ పేపర్‌తో పోలింగ్ జరుగుతుందని భావించడంతో, ఓటర్లు అయోమయంలో పడే అవకాశాలపై ఎన్నికల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థాయిలో ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉండటం, గుర్తుల ప్రభావం కీలకంగా మారనుంది.
కోటగిరిలో వర్గపోరు గతంలో ఎన్నో వివాదాలకు కారణమైంది. వర్గాల మధ్య జరిగిన గొడవలు, కేసులు, ఉద్యోగ నష్టాలు వంటి సంఘటనలు చాలా మందికి చేదు జ్ఞాపకాలు మిగిల్చాయి. ఇదే వర్గపోరు ఈసారి నామినేషన్లను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. గతంలో తాము బాధపడ్డ కారణకులే సర్పంచ్ బరిలో ఉన్నందుకు నిరసనగా, యువకులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసినట్లు వారు వెల్లడించడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. యువత స్పందనను కొందరు నాయకులు సమర్థిస్తుండగా, మరికొందరు ఇది రాజకీయ అయోమయానికి దారితీయవచ్చని విశ్లేషిస్తున్నారు.
కోటగిరిలో సర్పంచ్ పోటీ బీసీ జనరల్ కేటగిరీలో జరుగుతుండగా, మున్నూరు కాపు వర్గానికి చెందిన 25 మంది బరిలో ఉండటం పోటీని చాలా సంక్లిష్టంగా మార్చింది. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, అంతర్గత పోటీ విపరీతంగా ఉండటం వల్ల ఎవరికి లాభం చేకూరుతుందనే ప్రశ్న చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితుల్లో బీసీ మైనారిటీ వర్గానికి చెందిన అభ్యర్థులకు సువర్ణావకాశం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం. తుదిపోరులో అభ్యర్థుల సంఖ్య ఖరారైన తర్వాతే విజయావకాశాలు ఎవరివో అంచనా వేయవచ్చని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.









