ఎస్సీల జనాభా పెరుగుతున్నప్పటికీ, రిజర్వేషన్లలో ప్రతిబింబించకపోవడం తీవ్ర అన్యాయం అని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు దమ్మ నారాయణ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లు సక్రమంగా మాలలకు న్యాయం చేయడం లేదని, శాతానుగుణంగా 24 శాతం రిజర్వేషన్లు పెంచడం తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. మాలల సామాజిక, ఆర్థిక పురోగతికి ఈ నిర్ణయం అత్యంత కీలకమని దమ్మ నారాయణ స్పష్టం చేశారు.
మంగళవారం పట్టణంలోని విశ్రాంతి భవన ఆవరణలో మాల మహానాడు నాయకులు కలిసి ‘మాలల రణభేరి సభ’ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దమ్మ నారాయణ మాట్లాడుతూ, ఈ నెల 23న జరగనున్న రణభేరి సభను గొప్ప విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి మాలవారిపై ఉందన్నారు. మాలల హక్కుల సాధన కోసం చేపట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని సమర్ధిస్తూ ప్రతి కుటుంబం నుంచి ఒక్కోరు హాజరు కావాలని పిలుపునిచ్చారు.
ఎస్సీ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లు ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయకపోవడం చాలా కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టిందని ఆయన తెలిపారు. ఈ నిధులను వెంటనే విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. మాలల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనీసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు. దీని ద్వారా ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ కింద గత సంవత్సరంలో కేటాయించిన నిధులను విడుదల చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాల మహానాడు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిధులను తక్షణమే విడుదల చేసి, ఎస్సీ వర్గాల సంక్షేమానికి ఉపయోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాలెం చిన్నన్న, భూపెల్లి మల్లేష్, దొంత నర్సయ్య, భైరం లింగన్న, మినుముల శాంతికుమార్, దొండ ప్రభాకర్, గరిసే రవీందర్ తదితర నాయకులు పాల్గొని రాబోయే రణభేరి సభ విజయవంతం కోసం కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు.









