ప్రసిద్ధ కవి, సినీ గేయ రచయిత అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. స్థానిక తెలంగాణ చౌరస్తా లో నిర్వహించిన సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఆయన మహత్తర కవిత్వాన్ని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో అందెశ్రీ తన సాహిత్యంతో ప్రజలను ఉద్యమం వైపు కదిలించారని, వారి మనసుల్లో ఉద్యమ స్ఫూర్తి నూరిపోశారని వారు పేర్కొన్నారు. ప్రధానంగా ఆయన రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతం కోట్లాది ప్రజల గొంతుకగా మారి స్వరాష్ట్ర ఉద్యమ సాధనలో మహోన్నత పాత్ర పోషించిందని గుర్తు చేశారు.
సాహితీ ప్రపంచంలో ఆయన పాత్ర ఎప్పటికీ మరిచిపోలేని దశ అని, ఆయన రచనలు, కవిత్వం ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతాయని చెప్పుకున్నారు. కవిత్వం, గేయ రచనల ద్వారా తెలంగాణ ప్రజల జీవితాలలో స్ఫూర్తి పునాదులు వేసిన ఆయనను సదా స్మరిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గుండేటి రాజేష్ అధ్యక్షత వహించారు. జిల్లా ఉపాధ్యక్షులు ఎం. రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ సాగంటి శంకర్, చాట్ల సదానందం, మల్లారెడ్డి తిరుపతి రెడ్డి, దేవనపల్లి చక్రపాణి, రేషవేణి కేశవులు, మోతుకు అవినాష్, సారయ్య నాయక్, మెరుగు రాజేశం, పరకాల ప్రశాంత్ గౌడ్, పూజారి రాకేష్, సంపత్, మేకల అజయ్ తదితరులు పాల్గొన్నారు.









