జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 81 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 76 ఇప్పటికే ప్రారంభించబడ్డాయని జిల్లా కలెక్టర్ బీ.ఎం. సంతోష్ తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆయన చెప్పారు.
సోమవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లతో, సంబంధిత శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాల కారణంగా పంటలకు వచ్చిన నష్టాలపై ప్రభుత్వ చర్యలపై కూడా చర్చ జరిగింది.
ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచన ప్రకారం, మొత్తం 8,452 ధాన్యం కేంద్రాలలో 6,838 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి. మిగిలిన కేంద్రాలు త్వరలో ప్రారంభించాల్సి ఉందని, గోదాముల కొరత లేకుండా అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. నవంబర్ 20న సైక్లోన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశాన్ని దృష్టిలో ఉంచి, ధాన్యం తడిసిపోకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్యాడీ క్లీనర్లు, గన్నీ సంచులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ ప్రోక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రైతులు ధాన్యం అమ్మిన 48 గంటల్లో డబ్బులు ఖాతాల్లోకి జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పత్తి కొనుగోళ్లు సజావుగా జరగేలా సంబంధిత శాఖలు సమన్వయం చేసుకోవాలని, పత్తి తేమ శాతం, స్లాట్ బుకింగ్ సమస్యలపై కేంద్రానికి నివేదిక పంపుతున్నామని తెలిపారు.









