నారాయణపేట జిల్లా కేంద్రంలో పేద ప్రజలకు ప్రజా వైద్య సేవలు అందకపోవడంపై బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్యా యాదవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సమస్యను పబ్లిక్ చేశారు.
బస్టాండ్ ఎదురుగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బిల్డింగ్ భవనాన్ని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ గా మార్చేందుకు బడ్జెట్ రిలీజ్ అయ్యిందని, కానీ నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని సత్యా యాదవ్ పేర్కొన్నారు.
ఆసుపత్రి ఏర్పాటు కోసం బీజేపీ తరఫున నిరసనలు, ఆందోళనలు చేపట్టినప్పటికీ పాలకుల నుండి ఎలాంటి చలనం లేకపోవడం ప్రజల సమస్యను మరింత పెంచుతోంది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ వైద్య సేవలు అందని కారణంగా స్థానికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంతో మంగళవారం బీజేపీ సభ్యులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టనున్నట్లు సత్యా యాదవ్ తెలిపారు. మిర్చి వెంకటయ్య, సాయి బన్న, నందు నామాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.









