జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి వి. నవీన్ యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రతి బూత్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. “ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అయినా, మన బూత్‌లో మెజారిటీ ముఖ్యం. రహమత్‌నగర్‌లో ఉన్న 84 బూత్‌లలో అత్యధిక మెజార్టీ సాధించాలి” అని ఆయన స్పష్టం చేశారు.
గత పది సంవత్సరాలుగా కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏంటని ప్రజలు అడుగుతున్నారని, కానీ ఇప్పుడు వారు ఏ మొఖంతో ఓట్లు అడుగుతున్నారని పొన్నం ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, మొత్తం క్యాబినెట్ నవీన్ యాదవ్ వెంటే ఉన్నారని పేర్కొన్నారు.
“కాంటోన్మెంట్ ఉప ఎన్నిక మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్ గెలవడం ఖాయం. ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి,” అని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు రాబోయే ఎన్నికల్లో విజయానికి వ్యూహరచనపై చర్చించారు.









