హైదరాబాద్‌లో మరోసారి భారీ డ్రగ్స్ పట్టుబడ్డాయి. జీడిమెట్ల ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో దాచిపెట్టిన 220 కేజీల ఎపిడ్రిన్ డ్రగ్స్‌ను ఈగల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ సుమారు ₹70 కోట్లుగా అంచనా. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.
ఈగల్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఏపీ కాకినాడకు చెందిన శివరామక్రిష్ణ వర్మ జీడిమెట్లలోని స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో నివసిస్తూ డ్రగ్స్ తయారీ, రవాణా వ్యవహారాలు నిర్వహిస్తున్నాడు. అతనికి ఐడీఏ బొల్లారంలోని పీఎన్ఎం లైఫ్ సైన్స్ కంపెనీకి చెందిన అనిల్ పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి ఎపిడ్రిన్ తయారీకి కుట్ర పన్నారు. అందుకోసం మద్దు వెంకటక్రిష్ణరావు, ఎం.ప్రసాద్, దొరబాబు లతో టీం ఏర్పాటు చేసి కంపెనీ ల్యాబ్‌లోనే ఉత్పత్తి చేశారు.
శివరామక్రిష్ణ వర్మ ముడిసరుకులు, ఫార్ములా, నగదు అందించగా, బొల్లారులోని ల్యాబ్‌లో మూడు దశల్లో ఎపిడ్రిన్ తయారీ జరిగిందని ఈగల్ అధికారులు తెలిపారు. అనంతరం డ్రగ్స్‌ను వర్మ జీడిమెట్ల ఫ్లాట్‌లో దాచిపెట్టాడు. వాటిని కొనుగోలు చేయదలచిన వారిని వెతుకుతుండగా, గుప్త సమాచారం ఆధారంగా ఈగల్ టీం సోదాలు నిర్వహించి 220 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది.
ఈ ఎపిడ్రిన్‌కు మరికొన్ని ముడిసరుకులు జోడించి అంఫెటమైన్ డ్రగ్స్ తయారవుతాయని దర్యాప్తులో బయటపడింది. నిందితులు శివరామక్రిష్ణ వర్మ, అనిల్, దొరబాబు, వెంకటక్రిష్ణరావులను అరెస్టు చేశారు. మరో డైరెక్టర్ ప్రసాద్ పరారీలో ఉన్నాడు. పీఎన్ఎం లైఫ్ సైన్స్ కంపెనీని అధికారులు సీజ్ చేశారు. వర్మ గతంలో కూడా బెంగళూరు, హైదరాబాద్‌లలో డ్రగ్స్ కేసుల్లో ఎన్సీబీకి చిక్కినట్లు అధికారులు గుర్తించారు.









