హరియాణా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వై. పురాణ్ కుమార్ ఆత్మహత్య కేసులో పెద్ద మలుపు తిరిగింది. ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పి. కుమార్, ఈ ఘటనకు హరియాణా డీజీపీ శత్రుజిత్ సింగ్ కపూర్, రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాలు బాధ్యత వహించాలని ఆరోపించారు. వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
అమ్నీత్ ఛండీగఢ్ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. ఇందులో డీజీపీ, ఏడీజీపీ, ఎస్పీ ర్యాంకులకు చెందిన పది మంది సీనియర్ అధికారులు తన భర్తను మానసికంగా వేధించారని పేర్కొన్నారు. నిరంతర వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.
గత అక్టోబర్ 7న ఛండీగఢ్‌లోని నివాసంలో పురాణ్ కుమార్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఘటన స్థలంలో పోలీసులు ఎనిమిది పేజీల సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో పురాణ్ కుమార్ తనను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని, అవమానపరిచారని వ్రాసినట్లు సమాచారం.
పురాణ్ కుమార్ లేఖలో ఉన్న వివరాల ప్రకారం, ఉన్నతాధికారుల వేధింపులు, ఒత్తిడి కారణంగానే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు ప్రస్తుతం ఛండీగఢ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై హరియాణా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తీవ్ర చర్చ మొదలైంది.









