దేశీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న మారుతీ సుజుకి సంస్థ తన సర్వీస్ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించనుంది. దేశ వ్యాప్తంగా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 500 కొత్త సర్వీస్ వర్క్‌షాప్‌లు ప్రారంభించనున్నట్లు మారుతీ సుజుకి తెలిపింది.
బుధవారం సంస్థ తన 5,000వ అరీనా సర్వీస్ టచ్‌పాయింట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఈ ప్రకటన చేసింది. ఈ సందర్భంగా మారుతీ సుజుకి ఎండీ మరియు సీఈఓ హిసాషి టకేయుచి మాట్లాడుతూ, “మా కస్టమర్‌లకు వేగవంతమైన, విశ్వసనీయమైన సేవలు అందించాలనే దృష్టితో మేము నిరంతరం నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నాం” అని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ విస్తరణ ప్రణాళిక కొనసాగుతుందని పేర్కొన్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో అరీనా, నెక్సా ఛానెల్‌ల క్రింద 460 కొత్త టచ్‌పాయింట్లు ఏర్పాటు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది చివరికి నెట్‌వర్క్‌లో మొత్తం 5,640 సర్వీస్ వర్క్‌షాప్‌లు ఉంటాయని తెలిపింది. వీటి ద్వారా దేశవ్యాప్తంగా 2,818 నగరాల్లో కస్టమర్‌లకు సర్వీసులు అందిస్తామని మారుతీ సుజుకి వివరించింది.
మారుతీ సుజుకి ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీ 2.7 కోట్లకు పైగా వాహనాలకు సర్వీస్ అందించింది. ఇది ఇప్పటివరకు ఒకే ఏడాదిలో నమోదైన అత్యధిక సంఖ్య అని వెల్లడించింది. సర్వీస్ సౌకర్యాల విస్తరణతో మరింత మందికి వేగవంతమైన, నాణ్యమైన సర్వీస్ అందించడం సాధ్యమవుతుందని కంపెనీ నమ్మకం వ్యక్తం చేసింది.









