బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మరియు ఆమె భర్త వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు బాంబే హైకోర్టు నుండి పెద్ద షాక్ తగిలింది. రూ.60 కోట్ల మోసం కేసులో ఈ దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన శిల్పా-రాజ్ దంపతుల పిటిషన్‌ను కోర్టు తాజాగా కొట్టివేసింది.
కోర్టు స్పష్టంగా తెలిపింది — దేశం విడిచి వెళ్లాలంటే ముందుగా రూ.60 కోట్లు డిపాజిట్ చేయాలని. కోర్టు ఆదేశాలను పాటించకుండా విదేశాలకు వెళ్లడం అసాధ్యమని పేర్కొంది. దీంతో శిల్పా-రాజ్ ప్రణాళికలకు పెద్ద బ్రేక్ పడింది. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుండగా, లుకౌట్ నోటీసులు చెల్లుబాటు అవుతాయని కోర్టు స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళితే — ఒక వ్యాపారవేత్త రూ.60 కోట్ల మోసం జరిగిందని ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో శిల్పాశెట్టి అక్టోబర్ 25 నుండి 29 వరకు కొలంబోలో జరిగే ఒక ఈవెంట్‌కు హాజరు కావాలని ప్లాన్ చేశారు. ఇందుకోసం కోర్టు అనుమతి కోరగా, న్యాయమూర్తి — “మీకు అధికారిక ఆహ్వానం ఉందా?” అని ప్రశ్నించారు.
శిల్పా తరఫు న్యాయవాది స్పందిస్తూ, “ప్రస్తుతం ఫోన్ ద్వారా మాత్రమే ఆహ్వానం వచ్చింది, కోర్టు అనుమతి ఇస్తే అధికారిక పత్రాలు వస్తాయి” అని తెలిపారు. అయితే కోర్టు ఆ వివరణను సరైనదిగా అంగీకరించలేదు. “లుకౌట్ నోటీసులు ఉన్నప్పుడు విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వడం సబబు కాదు” అంటూ స్పష్టం చేసింది. దీంతో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులకు హైకోర్టు తీర్పు చుక్కెదురైందని చెప్పాలి.









