నిజాంసాగర్ ప్రాజెక్టులో సారదాగా ఈత కొట్టేందుకు వెళ్లి మృతి చెందిన అచ్చంపేట గురుకుల కళాశాల విద్యార్థి గొట్టం అజయ్ సంఘటనపై గురుకుల సోషల్ వెల్ఫేర్ జోనల్ అధికారులు విచారణ నిర్వహించారు. సంఘటన ఈనెల 7వ తేదీన చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ నేపధ్యంలో జోనల్ అధికారులు, డీసీవో సివిల్స్ పర్యవేక్షణలో, కళాశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు.
జోనల్ అధికారులు అజయ్ వెంట ప్రాజెక్టుకు వెళ్ళిన మిగిలిన నాలుగు మిత్రులతో విడివిడిగా విచారణ చేపట్టారు. విద్యార్థుల నుండి సంఘటన వివరాలు, ప్రాజెక్టు వద్ద జరిగే పరిస్థితుల గురించి వివరాలు సేకరించారు. డీసీవో కూడా విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి పాఠశాలలో విద్యార్థుల పరిస్థితులు, ఉపాధ్యాయుల విధుల తీరు గురించి అడిగి తెలుసుకున్నారు.
సోషల్ వెల్ఫేర్ సొసైటీ సెక్రటరీ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు, ఇంచార్జీ వైస్ ప్రిన్సిపల్ గణపతికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారంలోనే వివరణ అందించాలని సూచించారు. అలాగే ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు రవికాంత్ సస్పెన్షన్ అయ్యారు. ఔట్ సోర్సింగ్‌లో విధులు నిర్వహిస్తున్న తెలుగు ఉపాధ్యాయులు, పీటీ రాజు, వాచ్మెన్ కిషన్లపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
సమగ్ర విచారణ పూర్తయిన తర్వాత నూతన అధికారులను నియమించి పాఠశాల నిర్వహణలో లోపాలు తప్పకుండా సవరించనున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు హెచ్చరించారు. విద్యార్థుల భద్రత, పాఠశాలలో సక్రమ నిర్వహణను దృష్టిలో ఉంచి అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.









