ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అవినీతి వ్యవహారాలు తీవ్ర స్థాయికి చేరడంతో, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని లంచం వసూళ్లను రోజువారీ విధిగా మార్చుకున్నారు. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు విస్తృత దాడులతో అవినీతి అధికారులపై గంతలు వేస్తున్నారు. గత సంవత్సరం కాలంలోనే భారీ సంఖ్యలో అధికారులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండ్‌గా చిక్కిపోవడం జిల్లాలో అధికార వర్గాల్లో తీవ్ర గుబులు రేపింది. లంచం అడిగినా, ఇచ్చినా నేరమని స్పష్టంగా హెచ్చరిస్తూ ఏసీబీ అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
ఇప్పటికే రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖలకు పరిమితం కాకుండా, ప్రస్తుతం పంచాయతీ రాజ్, నీటిపారుదల, రవాణా, విద్యుత్, వ్యవసాయ, రిజిస్ట్రేషన్ సహా అన్ని ప్రభుత్వ శాఖలపై ఏసీబీ కంటిచూపు కఠినంగా మారింది. ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాల్సిన అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ, చేతులు తడపనిదే పని జరగదనే పరిస్థితిని సృష్టించడం ప్రజల్లో ఆవేదన పెంచుతోంది. దీంతో విసిగిపోయిన బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో, దాడులు మరింత పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదిస్తున్నారనే అనుమానాలపై కూడా ఏసీబీ నిశిత పరిశీలన చేస్తోంది.
జిల్లాలో ఇటీవల జరిగిన దాడులు అవినీతి స్థాయిని బట్టబయలు చేశాయి. జక్రాన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి రూ.4,000 లంచం తీసుకుంటూ పట్టుబడగా, కామారెడ్డిలో ఏఈ రూ.12,500 లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండ్‌గా చిక్కాడు. కమ్మర్పల్లి, ఆర్మూర్, నందిపేట, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ పలువురు ఉద్యోగులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. కొందరి ఇళ్లలో కోట్ల రూపాయల ఆస్తులు బయటపడటం జిల్లాలో అవినీతి తిమింగలాల దౌర్జన్యాన్ని స్పష్టంగా చూపింది. కోటగిరి జీపీ కార్యదర్శి నుండి ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరకూ పలువురు అధికారులు ఈ ఏడాది ఏసీబీ బారిన పడ్డారు.
అవినీతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు దైర్యంగా ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు పిలుపునిచ్చారు. లంచం అడిగితే వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్ 1064 కు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, ప్రజలు అలాంటి చర్యలకు పాల్పడకూడదని హెచ్చరిస్తున్నారు. అవినీతిని జాడతో సహా నిర్మూలించడమే లక్ష్యమని, ప్రజల సహకారంతో అవినీతి అధికారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.









