పట్నాలో ప్రపంచంలోనే ఖరీదైన పుస్తకం

At Patna Book Fair, author Ratneshwar unveiled “Mai,” valued at ₹15 crore, with only 16 copies printed, exploring deep spiritual philosophy.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం బీహార్‌లో ఆవిష్కృతమైంది. పట్నాలోని గాంధీ మైదాన్‌లో జరుగుతున్న బుక్ ఫెయిర్‌లో ‘మై’ అనే పుస్తకం ధర అక్షరాలా రూ. 15 కోట్లు కావడం సంచలనంగా మారింది. బీహార్‌కు చెందిన రచయిత రత్నేశ్వర్ రచించిన ఈ పుస్తకం ప్రపంచ పుస్తక రంగంలోనే కొత్త రికార్డును సృష్టించింది. పుస్తకం విడుదలైన వెంటనే సందర్శకులు భారీ సంఖ్యలో బుక్ ఫెయిర్‌కి తరలివచ్చారు.

ఈ పుస్తకాన్ని మొత్తం 16 కాపీలు మాత్రమే ముద్రించగా, అందులో 11 కాపీలను రచయిత వ్యక్తిగతంగా ప్రత్యేక వ్యక్తులకు బహుమతిగా ఇచ్చారు. కేవలం మూడు కాపీలను మాత్రమే అమ్మకానికి ఉంచడం వల్ల దీని విలువ మరింత పెరిగింది. రత్నేశ్వర్ ప్రకారం, ఈ పుస్తకం జీవన తత్వాన్ని లోతుగా వివరిస్తూ ఆధ్యాత్మిక మేల్కొలుపు వైపు పాఠకులను నడిపిస్తుంది.

పుస్తకం ధరను తానే నిర్ణయించలేదని, “దేవుడే నిర్ణయించాడు” అని రచయిత రత్నేశ్వర్ వెల్లడించారు. తన ఆధ్యాత్మిక యాత్ర, తత్వచింతన, ప్రపంచాన్ని చూసే దృష్టి ఈ విలువను నిర్ణయించాయని చెప్పారు. “ధర ఎక్కువ అనిపిస్తే కొనాల్సిన అవసరం లేదు. ఈ గ్రంథం జ్ఞానోదయం స్థితిని అన్వేషించే వారికి మాత్రమే” అని ఆయన వివరణ ఇచ్చారు. గౌతమ బుద్ధుడు పొందిన పరమజ్ఞాన స్థితి ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం ఈ పుస్తకం అందిస్తుందని రత్నేశ్వర్ పేర్కొన్నారు.

పట్నా బుక్ ఫెయిర్‌ను డిసెంబర్ 5న బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రారంభించారు. ఈ ప్రదర్శన డిసెంబర్ 16 వరకు కొనసాగుతుంది. ఫెయిర్‌లో ‘మై’ పుస్తకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పుస్తకంలోని తత్త్వం, ధర, అరుదైన కాపీలు — ఇవన్నీ చూసేందుకు పాఠకులు, పుస్తక ప్రియులు పెద్ద సంఖ్యలో గాంధీ మైదాన్‌కు చేరుకుంటున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share