హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో జరిగిన స్థానిక ఎన్నికల ప్రచార సభలో బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆత్మగౌరవాన్ని డబ్బుతో కొనలేరని, ఓటు విలువను ఎవరూ తగ్గించలేరని స్పష్టం చేశారు. రాజకీయాల్లో డబ్బు, దావతులు, మద్యం ఆధారంగా ఓట్లు అడిగే సంస్కృతిని ప్రజలు తప్పక తిరస్కరించాలంటూ పిలుపునిచ్చారు. ఓటు భవిష్యత్తును నిర్ణయించే శక్తి కాబట్టి దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్ముకోవద్దని హితవు పలికారు.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సామర్థ్యం లేదని ఈటల విమర్శించారు. గ్రామాల్లో అభివృద్ధి సాధ్యం కావాలంటే కేంద్రం నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడాల్సి వస్తుందని అన్నారు. కేంద్రం కేటాయించే ఫండ్ల వల్లే గ్రామాల్లో రహదారులు, మౌలిక వసతులు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. అభివృద్ధి కోసం కృషి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని, భావోద్వేగాలు, కులాల ఆధారంగా ఓట్లు వేయకూడదని సూచించారు.
కమలాపూర్ నే తనకు రాజకీయాల్లో ముఖ్యమైన స్థానం ఇచ్చిన గడ్డేనని, కేంద్రంలో ఉన్న నేతగా తన వంతు సహాయం తప్పకుండా చేస్తానని ఈటల భరోసా ఇచ్చారు. గ్రామానికి ఏ అభివృద్ధి కావాలన్నా, ప్రజలు కోరుకున్నా, తాను ముందుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా చెప్పాలని, తమ అండగా నిలబడటమే తన ధ్యేయమని అన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ సర్పంచ్ అభ్యర్థి పబ్బు సతీష్‌తో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపించాలని ఈటల కోరారు. బలహీనతలకు, ఎమోషన్లకు లోనవ్వకుండా సమర్థులను ఎన్నుకోవడం ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రజా ఆత్మగౌరవం అమ్ముకోలేనిదని, దాన్ని కాపాడటం ప్రతి ఓటరుడి బాధ్యత అని ఈటల రాజేందర్ సందేశం ఇచ్చారు.









