ఒకప్పుడు టీ అంటే తేయాకులు లేదా టీ పౌడర్ వేయడం మాత్రమే తెలిసిన పద్ధతి. కానీ ఇటీవల ప్రీమియం టీ బ్యాగులు అనే కొత్త ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. కప్పులో వేడి నీటిలో లేదా పాలలో దారంతో కట్టి ఉన్న టీ బ్యాగును ముంచి తాగడం ఆరోగ్యానికి మంచిదని, టీ లోని పోషకాలు అలాగే లభిస్తాయని చాలామంది నమ్ముతున్నారు. అయితే ఈ భావనలో దాగి ఉన్న ప్రమాదం గురించి చాలా మందికి తెలియదు. టీబ్యాగ్‌లోని ప్లాస్టిక్ పదార్ధం వేడిలో కరిగి టీలో కలిసిపోతుందన్న సంగతి పరిశోధనలు ఇప్పుడు బయటపెడుతున్నాయి.
కెనడాలోని పేరుమోసిన మ్యాగిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం, ఒక కప్పు వేడి టీలో ప్రీమియం టీ బ్యాగ్‌ను ముంచినప్పుడు 11.6 బిలియన్ మైక్రోప్లాస్టిక్‌లు మరియు 3.1 బిలియన్ నానోప్లాస్టిక్‌లు విడుదలవుతున్నాయి. ఇవి నైలాన్, పాలిస్టర్ వంటి ప్లాస్టిక్ పదార్ధాలతో తయారైన టీబ్యాగ్‌ల నుంచి వెలువడుతున్నాయని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా నిర్ధారించారు. కొంతమంది సంస్థలు ఇవి బయోడిగ్రేడబుల్ అని చెబుతున్నప్పటికీ పరిశోధనలు మాత్రం దానికి విరుద్ధంగా PLA (polylactic acid) అనే ప్లాస్టిక్ పదార్థం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నాయి.
ఇలాంటి చిన్నపాటి మైక్రోప్లాస్టిక్‌లు టీతో కలిసి మన శరీరంలోకి వెళ్లినప్పుడు వందలాది సమస్యలకు కారణం అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి రక్తం, ఊపిరితిత్తులు, ఇమ్యూన్ సిస్టమ్‌ను ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలంలో హార్మోన్ అసమతుల్యత, జన్యు లోపాలు, రీప్రొడక్టివ్ సమస్యలు, క్యాన్సర్ ప్రమాదం వంటి తీవ్ర సమస్యలకు దారితీయవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మైక్రోప్లాస్టిక్‌లు పూర్తిగా కరిగిపోవు కాబట్టి శరీరంలో పేరుకుపోయే అవకాశం కూడా ఉంది.
2024లో బార్సిలోనా యూనివర్సిటీ చేపట్టిన మరో పరిశోధన కూడా ప్రీమియం టీ బ్యాగుల ప్రమాదాన్ని స్పష్టంగా చెప్పింది. టీబ్యాగుల్లోని మైక్రోప్లాస్టిక్‌లు నేరుగా మానవ కణాల్లోకి చొచ్చుకుపోయి గట్ బారియర్‌ను దెబ్బతీస్తాయని, తద్వారా ఇమ్యూనిటీ బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. చాయ్ అనేది అనేక మందికి రోజువారీ అలవాటు కావడంతో ఈ హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ప్రీమియం టీ బ్యాగుల వినియోగంపై పునరాలోచన అవసరం అనే అభిప్రాయం నిపుణులది.









