తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన డాక్టర్ మన్మోహన్ సింగ్ భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం రాష్ట్రంలోని భూ విజ్ఞాన రంగంలో ఒక మైలురాయి. నూతన యూనివర్శిటీ విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి, పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఏర్పాటైంది.
విద్యా కార్యక్రమాలు:
ప్రారంభ ఐదేళ్లలో బీఎస్సీ జియాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జియోఇన్ఫర్మేటిక్స్, బీటెక్, ఎంఎస్సీ, ఎంటెక్ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు. డిప్లొమా/పీజీ డిప్లొమా మైన్ సేఫ్టీ, రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ కోర్సులు కూడా ఉండనున్నాయి.
జియో ఏఐ కోర్ కరిక్యులమ్:
ఎంఐటీ నమూనా ప్రకారం, విద్యార్థులు కంప్యూటేషనల్ జియోసైన్స్, జియో ఇన్ఫర్మేటిక్స్ లో కోర్ మాడ్యూల్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. పరిశ్రమ, ప్రభుత్వ సంస్థలతో భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ISRO, NRS Seal, Singareni Collieries, ONGC వంటి సంస్థల సహకారం తీసుకుంటారు.
ఉద్యోగులు:
ప్రారంభ దశలో 64 మంది బోధనా సిబ్బందిని నియమించనున్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా సిలబస్ రూపొందించడానికి కనీసం 5 మంది ‘ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్’ ను నియమిస్తారు.
ఆర్థిక కేటాయింపులు (2025-26):
మొత్తం బడ్జెట్ రూ.1,306.756 లక్షలు, అందులో ప్రయోగశాలల కోసం రూ.195.793 లక్షలు, సివిల్ పనుల కోసం రూ.1,110.963 లక్షలు కేటాయించనున్నారు. నిధులు రాష్ట్ర, కేంద్ర గ్రాంట్లు, పరిశ్రమ భాగస్వామ్యాలు, విద్యార్థుల ఫీజులు, అంతర్జాతీయ గ్రాంట్లు, దాతృత్వం ద్వారా సేకరించనున్నారు.









