పాన్ మసాలా తయారీదారులు, ప్యాకర్లు మరియు దిగుమతిదారులకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలో విక్రయించే ప్రతి పాన్ మసాలా ప్యాకేజీపై పరిమాణం లేదా బరువు సంబంధం లేకుండా రిటైల్ సేల్ ధర (RSP)తో పాటు 2011 మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్ ప్రకారం తప్పనిసరి డిక్లరేషన్లు స్పష్టంగా కనిపించేలా ముద్రించాల్సిందేనని శాఖ స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం 10 గ్రాములు లేదా అంతకంటే తక్కువ బరువున్న పాన్ మసాలా చిన్న ప్యాకెట్లకు కొన్ని డిక్లరేషన్ నిబంధనల నుంచి మినహాయింపు లభిస్తోంది. కానీ కేంద్రం జారీ చేసిన తాజా ఆదేశాలతో ఆ మినహాయింపులు పూర్తిగా రద్దు కానున్నాయి. ఇకపై చిన్న ప్యాక్‌లు కూడా పెద్ద ప్యాక్‌ల మాదిరిగానే RSP, తయారీదారు వివరాలు, నికర బరువు, తయారీ తేదీ వంటి అన్ని సమాచారాన్ని ప్యాకేజీపై స్పష్టంగా చూపించాల్సిందే.
ఖరీదుదారులు గందరగోళానికి గురయ్యే విధంగా చిన్న ప్యాక్‌లపై అస్పష్టమైన ధరలు, తప్పుదారి పట్టించే లేబుళ్లను అరికట్టడమే ఈ నిర్ణయంతో ప్రధాన ఉద్దేశమని వినియోగదారుల వ్యవహారాల విభాగం పేర్కొంది. చిన్న ప్యాక్‌లలో అసలు ధర కంటే ఎక్కువకు విక్రయం చేయడం, లేబుల్ సమాచారం లేకపోవడం వంటి పరిస్థితులు నిరోధించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
ఈ చర్యతో వినియోగదారులు అన్ని ప్యాకేజీలలోనూ స్పష్టమైన ధరా సమాచారం, ఉత్పత్తి వివరాలు తెలుసుకోగలరు. దాంతో, ఏ ఉత్పత్తిని కొనాలన్న నిర్ణయం సరైన సమాచారంతో తీసుకునే అవకాశం ఉంటుంది. పారదర్శకత పెరగడం మాత్రమే కాదు, మార్కెట్లో మోసపూరిత పద్ధతులకు అడ్డుకట్ట వేయడంలో ఈ నిబంధనలు కీలక పాత్ర పోషించనున్నాయని కేంద్ర విభాగం తెలిపింది.








