రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రఘునాధపాలెం మండలంలో పర్యటనలో రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. మార్గమధ్యలో రజబ్ అలీనగర్ గ్రామంలోని పొలాలను సందర్శిస్తూ, పత్తి, మొక్కజొన్న పంటల పరిస్థితిని పరిశీలించారు. బాణోత్ వీరన్న-విజయలకు చెందిన పొలం వద్ద వెళ్లి, గతంలో ఏ పంటల నుండి ఎంత దిగుబడి సాధించారో రైతులతో తెలుసుకున్నారు.
మంత్రి రైతులను పత్తి, మొక్కజొన్నల పంటల బదులుగా పామాయిల్ సాగు చేయాలని ప్రోత్సహించారు. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలంలో అధిక లాభాలు పొందవచ్చని వివరించారు. పామాయిల్ పంట ద్వారా ఆకస్మిక వర్షాలు, రాళ్లవానలు, కోతులు, అడవి పండులతో కలిగే నష్టాలు తగ్గుతాయని, మందులు, ఖర్చులు తక్కువగా ఉంటాయని చెప్పారు.
పామాయిల్ పంటకు సంబంధించిన మొక్కలు, డ్రిప్ పరికరాలు, ఎరువులపై ప్రభుత్వం సబ్సిడీ సాయం అందిస్తుందని మంత్రి వివరించారు. మంచి మార్కెట్ డిమాండ్ ఉన్నందున పండిన పంటకు ఎలాంటి మార్కెటింగ్ సమస్యలు రాకుండా, రైతులు లాభాలు పొందగలరని తెలిపారు. గ్రామాల్లో స్థానిక నేతలు, ఉద్యాన శాఖ అధికారులు పామాయిల్ సాగును ప్రోత్సహించాలి అని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి. పుల్లయ్య, జిల్లా ఉద్యానవన అధికారి మధుసూదన్, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, వివిధ శాఖల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.









