జిల్లా కలెక్టర్ కే. హైమావతి నారాయణరావుపేట మండలం జక్కాపూర్ ఐకేపీ సెంటర్‌ను సందర్శించి వరి ధాన్యం తేమ శాతాన్ని స్వయంగా తనిఖీ చేశారు. తేమ శాతం సరైనస్థాయికి చేరిన వెంటనే గన్నీ బ్యాగుల్లో నింపి మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సెంటర్‌లో తాగునీరు, నీడ, విశ్రాంతి వసతులు వంటి అన్ని అవసరాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో జాప్యం జరగకుండా ప్రతి దశను పర్యవేక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
తరువాత కలెక్టర్ గుర్రాలగొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన (MDM) కిచెన్ ప్రక్రియను పరిశీలించారు. విద్యార్థులకు వండుతున్న కూర నాణ్యతను పరిశీలించిన ఆమె భోజనం రుచికరంగా, శుభ్రత ప్రమాణాలతో ఉండాలని సూచించారు. పిల్లల ఆరోగ్యానికి హాని కలగకుండా పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్‌ను తనిఖీ చేస్తూ, మెడికల్ ఆఫీసర్ బాపురెడ్డి డ్రై డే కోసం వెళ్లినట్లు, ఇతర సిబ్బంది ఫీల్డ్‌లో ఉన్నట్లు స్టాఫ్ తెలిపినా, దీనిపై పూర్తిగా ఆరా తీయాలని తహసీల్దార్‌కు సూచించారు. విధులు నిర్వహించకుండా కేవలం పేరుకే రిజిస్టర్ రాసే అలవాటు ఉంటే కఠిన చర్యలు తప్పవని డీఎంఎండీహెచ్ఓకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందాలంటే పీహెచ్‌సీలను నిరంతరం పర్యవేక్షించడం తప్పనిసరిగా భావిస్తున్నట్లు కలెక్టర్ హైమావతి అన్నారు. సిబ్బందిలో బాధ్యతాభావం పెరగాలని, అనుమతి లేకుండా డ్యూటీలకు హాజరుకాని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పీహెచ్‌సీల పాత్ర కీలకమని, అందువల్ల ప్రతి సేవను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.









