ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేయడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. దర్శనాలు నిలిపివేయడమే కాకుండా, ఈ చర్య వల్ల స్థానిక వ్యాపారులు, పూజారులు, భక్తులపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వేములవాడ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాకుండా, వేలాది కుటుంబాల జీవనాధారం అని గుర్తు చేశారు.
బీజేపీ సీనియర్ నాయకుడు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ, “భక్తులకు దర్శనాలు నిలిపివేయడం తగదు. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు కానీ, ఇలాంటి నిర్ణయాలు ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తీసుకోవాలి” అన్నారు. ఆలయం మూసివేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో కుటుంబాలు జీవనోపాధి కోల్పోతాయని ఆయన పేర్కొన్నారు.
అలాగే ఆలయ పరిసరాల్లో ఉన్న దర్గాను తొలగించకముందే దేవతా విగ్రహాలను ముట్టుకోవడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు. భక్తుల భావోద్వేగాలను దెబ్బతీయకుండా ప్రభుత్వం, అధికారులు వ్యవహరించాలని డిమాండ్ చేశారు. దర్శనాల నిలిపివేతపై ప్రజలకు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్, నాయకులు కటకం శ్రీనివాస్, నామాల శేఖర్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో జరుగుతున్న పరిణామాలపై అధికారులు తక్షణ స్పందన ఇవ్వాలని, భక్తుల విశ్వాసాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని వారు ఆవశ్యకతను వ్యక్తం చేశారు.









