ప్రస్తుత ఆధునిక యుగంలో ప్రతి రంగంలోనూ యంత్రాల ఆధిపత్యం పెరిగిపోతోంది. విద్యార్థుల చదువుల నుంచి రైతుల వ్యవసాయ పనుల వరకు యంత్ర సహాయమే ప్రధానమైపోయింది. ముఖ్యంగా గత పదేళ్లలో రైతులు వరినాటే యంత్రాలు, పిచికారీ పరికరాలు, కోత మిషన్లను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. దీంతో పాతకాలంలా కూలీలతో పంట కోయడం, ధాన్యం నూర్పిడి చేయడం అనే పద్ధతి దాదాపుగా కనుమరుగైపోయింది.
కానీ ఈ పరిస్థితుల్లో మిర్యాలగూడ సమీపంలో ఓ రైతు సంప్రదాయ పద్ధతిలో వరి కోత చేయించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ రైతు యంత్రాల బదులు కూలీల సహాయంతో వరి కోయించి, ట్రాక్టర్ ద్వారా నూర్పిడి చేసి ధాన్యాన్ని బస్తాల్లో నింపాడు. ఈ దృశ్యం చూసిన స్థానికులు గతం గుర్తుచేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.
రైతు చెబుతున్న ప్రకారం, మిషన్లు అందుబాటులో లేకపోవడంతో పాటు విత్తనపు వడ్ల కోసం నాణ్యమైన ధాన్యం సేకరించాలన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని ఎంచుకున్నాడని పేర్కొన్నాడు. యంత్రాలపై పూర్తిగా ఆధారపడకూడదని, పాత పద్ధతులు కూడా కొన్ని సందర్భాల్లో ఉపయోగపడతాయని ఆయన భావన తెలిపాడు.
రోడ్డు వెంట ప్రయాణించిన ప్రజలు కూడా ఈ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. “ఇలాంటి పద్ధతులు మళ్ళీ చూడటం ఆనందంగా ఉంది” అంటూ పలువురు రైతుని అభినందించారు. ఆధునిక యుగంలో సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పునరుద్ధరించిన ఈ మిర్యాలగూడ రైతు, అందరికీ మానవతా స్పర్శతో కూడిన ఉదాహరణగా నిలిచాడు.









