తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ‘జనం బాట’ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం, స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వహించడం లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్బంగా జాగృతి నాయకులు పట్టణ వ్యాప్తంగా కవిత చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. కవిత రాకతో నగరంలో ఉత్సాహం నెలకొంది.
అయితే రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు ఆ ఫ్లెక్సీలు, హోర్డింగులను తొలగించినట్లు సమాచారం. అధికారులు ఈ చర్యను పట్టణ అందాన్ని కాపాడటానికి చేపట్టిన సాధారణ ప్రక్రియగా చెబుతున్నారు. కానీ జాగృతి నాయకులు మాత్రం దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవిత పర్యటనకు ముందే ఫ్లెక్సీలు తీసేయడం రాజకీయ ఉద్దేశ్యంతోనే జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.
జాగృతి నాయకులు మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధుల పర్యటనల సందర్భంలో ఇతర పార్టీల హోర్డింగులను తొలగించని అధికారులు, కవిత చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం అన్యాయం అన్నారు. ప్రజలతో కవిత సమావేశం జరగబోతున్న సమయంలో ఇలా చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.
ఈ ఘటనపై స్థానికంగా చర్చ జోరుగా నడుస్తోంది. కొందరు రాజకీయ ఉద్దేశ్యపూర్వక చర్యగా చూస్తుండగా, మరికొందరు నగర పాలక సంస్థ నిబంధనల ప్రకారం ఫ్లెక్సీల తొలగింపు సహజమని అంటున్నారు. కవిత పర్యటన నేపథ్యంలో జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు మోహరించారు.









